మంత్రి వ్యాఖ్యలను నేను సమర్ధించ లేదు… వక్రీకరించి హెడ్డింగ్ పెట్టారు : నిర్మాత నట్టి కుమార్
సమంత గురించి మంత్రి కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలను తాను సమర్ధించినట్లు ఓ వెబ్ సైట్ లో వచ్చిన వార్తను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తాను ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో వివిధ రకాల అంశాలను వారు ప్రస్తావించినప్పుడు , తాను బదులిచ్చానని , అయితే మంత్రి కొండా సురేఖ గారు సమంతపై చేసిన వ్యాఖ్యలపై స్పందించమని వారు అడిగినపుడు…. మంత్రి చేసిన ఆరోపణలలో వాస్తవాలు తనకు తెలియవని, ఆ విషయం గురించి తాను మాట్లాడానని స్పష్టంగా చెప్పానని, ఏమైనా ఆధారాలు ఉంటే వారు లీగల్ గా చూసుకోవాలని చెప్పానని,
అయితే దానిని వక్రీకరించి మేటర్ కు హెడ్డింగ్ కు సంబంధం లేకుండా ఇండియా హెరాల్డ్ గ్రూప్, డైలీ హంట్ అనే వెబ్ సైట్ లో సమంతపై మంత్రి చేసిన వ్యాఖ్యలను తాను సమర్ధించినట్లు క్వచ్చిన్ (?) మార్క్ పెట్టి మరీ వార్త వచ్చిందని, దీనిని తాను ఖండిస్తున్నాని నిర్మాత నట్టి కుమార్ తెలిపారు. తనకు జర్నలిస్టులు అన్నా, మీడియా వ్యవస్థలు అన్నా ఎంతో గౌరవమని, పొద్దున్న లేచినప్పట్నుంచి మీడియా వారితో కలసి, మెలసి ఉండటం, వారికి ఇంటర్వ్యూ లు ఇవ్వడం తనకు ఎన్నో ఏళ్లుగా అలవాటు అని ఆయన వివరించారు.
అయితే తాను ఎప్పుడు ఏ మాటలు అన్నా దానికి కట్టుబడి ఉంటానని మీడియా వారికీ తెలుసునని, అయితే తన మాటలను వక్రీకరించి, హెడ్డింగ్ పెట్టడం తనకు బాధను కలిగించిందని ఆయన అన్నారు. వెంటనే వారు దానిని తొలగించి, తాను ఖండించిన ఈ వార్తను వేయాలని అన్నారు. దీనిపై తాను సైబర్ క్రైమ్ సెల్ వారికీ ఫిర్యాదు చేయడమే కాకుండా లీగల్ చర్యలకు వెనుకాడనని స్పష్టం చేశారు. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ , కొన్ని వెబ్ సైట్స్ లో మాట్లాడిన మాటలకు, హెడ్డింగ్ లకు సంబంధం ఉండటం లేదని, సంచలనం కోసం, ఎక్కువమంది చూడాలనే తపనతో ఇలా వక్రీకరించడం కరెక్ట్ కాదని అన్నారు. అలా అని మీడియా వారినందరిని తాను అనడం లేదని, అలా వ్యవహరిస్తున్న వారు తమ పద్ధతి మార్చుకోవాలని ఆయన కోరారు.