Telangana News: రాజధాని హైదరాబాద్ అనూహ్య విస్తరణ - సోషల్ మీడియాలో నెటిజన్ల చర్చ
గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతున్నది. మహా నగరానికి ఉన్న నలుదిక్కులు ఒక్కో రంగానికి ఫేమస్ అవుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. తాజాగా, అంతర్జాతీయ భౌగోళిక నిపుణుడు కెవిన్ హేన్స్ హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నదని.. విస్తరిస్తున్నదని తెలిపారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) మాస్టర్ ప్లాన్ ఫొటోను పోస్ట్ చేసిన ఆయన.. నగరానికి వెస్ట్‌జోన్‌లో ఉన్న సంగారెడ్డి వైపు పట్టణీకరణ వేగంగా జరుగుతున్నదని, ఇక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగుందని ట్వీట్‌చేశారు.
ఈ ట్వీట్‌ను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్ రీట్వీట్ చేశారు. కెవిన్ హేన్స్ చేసిన ట్వీట్‌ను చూసి నెటిజన్లు సైతం తమ అభిప్రాయాలను పంచుకొన్నారు. సంగారెడ్డికి సమీపం నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వెళ్తున్నదని, సంగారెడ్డి దాటాక జహీరాబాద్ సమీపంలో నిమ్జ్ వస్తున్నదని, దీనివల్ల ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుందని ట్వీట్ చేశారు. పటాన్‌చెరు మీదుగా ముంబై జాతీయ రహదారి వెంబడి పరిశ్రమలు ఉండటంతో అక్కడ పనిచేస్తున్నవారు తమ నివాస ప్రాంతాలను సంగారెడ్డి చుట్టుపక్కల ఎంచుకొంటున్నారని లారెన్స్ అనే నెటిజన్ అభిప్రాయపడ్డారు. ఒక్కొక్కరు ఒక్కోలా హైదరాబాద్ అభివృద్ధిపై చర్చించారు.
ఏ దిక్కున ఏ రంగానికి ప్రాధాన్యం ?
-----------------
శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద ట్రాన్స్‌పోర్టు హబ్ కొత్తూరు, షాద్‌నగర్ ప్రాంతాల్లో పరిశ్రమలు పెద్ద అంబర్‌పేట, ఘట్‌కేసర్ ప్రాంతాల్లో కమర్షియల్ జోన్స్, పటాన్‌చెరు, ఉప్పల్ ప్రాంతాల్లో పరిశ్రమల కారిడార్లు(సంగారెడ్డి, మేడ్చల్, బీబీనగర్, భువనగిరి, చౌటుప్పల్, షాబాద్, చేవెళ్ల ప్రాంతాలు అభివృద్ధిలో కీలకంగా ఉన్నాయని హెచ్‌ఎండీఏ ప్లాన్‌లో పేర్కొన్నది).
పడమర దిక్కున వేగవంతమైన అభివృద్ధి
-----------------------
పట్టణీకరణ పరంగా హైటెక్ సిటీకి పశ్చిమ దిక్కున చాలా భవిష్యత్తు ఉన్నదని నా పరిశోధన ద్వారా తెలిసింది. త్వరితగతిన హైదరాబాద్ మహానగరంలో సంగారెడ్డి భాగమయ్యే అవకాశం ఉన్నది. ఇటువైపు రియల్‌ఎస్టేట్ బాగా పెరుగుతున్నది. గ్రేటర్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ మాస్టర్‌ప్లాన్‌ను భౌగోళిక చిత్ర పటం (మ్యాప్స్) ద్వారా ఎక్కడ ఎలాంటి పరిశ్రమలు, ఏ రంగానికి ప్రాధాన్యమిస్తున్నారో మరింతగా అర్థమయ్యేలా చెప్పాలి. కెవిన్ హేన్స్, అంతర్జాతీయ భౌగోళిక శాస్త్ర నిపుణుడు.