Saudi Arabia News : రియాద్ లో గ్లోబల్ లేబర్ మార్కెట్ సదస్సు : హాజరైన కుంతియా, భీంరెడ్డి, చేతన
Global Labor Market Conference : రియాద్ లో గ్లోబల్ లేబర్ మార్కెట్ సదస్సు : హాజరైన కుంతియా, భీంరెడ్డి, చేతన, సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న గ్లోబల్ లేబర్ మార్కెట్ సదస్సు బుధవారం ప్రారంభం అయింది. 45 దేశాల కార్మిక మంత్రులు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, 200 మంది వక్తలు, 100 కు పైగా దేశాల నుంచి 5 వేలకు పైగా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రేస్ (ఐఎన్టీయూసీ) జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ రామచంద్ర కుంతియా, తెలంగాణకు చెందిన వలస కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి, రియాద్ లో నివసిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన సామాజిక సేవకురాలు చేతన జగదీష్గారి ఈ సదస్సులో పాల్గొన్నారు.
ఈ సదస్సులో ప్రభుత్వ, ప్రైవేట్ రంగం, అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) ప్రతినిధుల మధ్య సమావేశాలు జరుగుతాయి. ప్రపంచ బ్యాంకు, ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమ ఆర్థిక సంస్థ సహకారంతో 50కి పైగా ప్రత్యేక చర్చలు జరుగుతాయి. కీలకమైన లేబర్ మార్కెట్ సవాళ్లను పరిష్కరించడం, వినూత్న పరిష్కారాలు, ఉత్తమ పద్ధతులు (బెస్ట్ ప్రాక్టీసెస్), ప్రపంచ అనుభవాలను ప్రదర్శించడంపై ఈ సదస్సు దృష్టి సారిస్తుంది. దేశాలు, సంస్థల మధ్య ఒప్పందాలు జరుగుతాయి.
ఈ సందర్బంగా మంద భీంరెడ్డి మాట్లాడుతూ వేగవంతమైన మార్పులకు అనుగుణంగా స్థిరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, యువత ఎదుర్కొంటున్న సవాళ్లను పరిశీలించడం, వారి పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించాలనే ప్రపంచ స్థాయి లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి కృషి చేస్తున్న విషయం గుర్తుకు వస్తున్నదని అన్నారు.