Telangana News: ఎయిడ్స్, హెపటైటిస్ రోగులకు సర్కారు వరం: మంత్రి హరీశ్‌రావు
రాష్ట్రంలో కిడ్నీ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న ఎయిడ్స్, హెపటైటిస్ రోగులకు ఉచితంగా డయాలిసిస్ సేవలు అందించాలని అధికారులను వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. ఇందుకోసం హైదరాబాద్, వరంగల్‌లో ఒక్కో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని సూచించారు. బుధవారం ఆయన వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఆరోగ్యశ్రీ సేవలపై సమీక్ష నిర్వహించారు. ప్రత్యేక డయాలసిస్ కేంద్రాల్లో ఎయిడ్స్, హెపటైటిస్ రోగులకు ఐదు చొప్పున బెడ్లు కేటాయించాలని ఆదేశించారు. కిడ్నీ వ్యాధిగ్రస్థులు డయాలిసిస్ చేయించుకోవడం ఆర్థికంగా భారంగా మారటంతో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ఉచిత కేంద్రాలను ఏర్పాటుచేశారని గుర్తుచేశారు.
ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 43 డయాలిసిస్ కేంద్రాలు నడుస్తున్నాయని, వీటి ద్వారా 10 వేలమంది రోగులకు నిత్యం సేవలు అందుతున్నాయని వివరించారు. వీటి నిర్వహణకు ప్రభుత్వం ఏటా రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నదని తెలిపారు. ఈ కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఈహెచ్‌ఎస్ కింద ఉచితంగా డయాలసిస్ చేయాలని అధికారులను ఆదేశించారు. బాధితుల తాకిడి ఎక్కువగా ఉన్న కేంద్రాలను గుర్తించి, అదనపు డయాలసిస్ యంత్రాల కోసం ప్రతిపాదనలు తయారుచేయాలని డీఎంఈ రమేశ్‌రెడ్డిని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. రోగుల సంఖ్య ఆధారంగా కొత్త డయాలసిస్ కేంద్రాలు అవసరం ఉన్న ప్రాంతాలను గుర్తించి, వాటికోసం కూడా ప్రతిపాదనలు సిద్ధంచేయాలని సూచించారు.
ఆరోగ్య శ్రీ ట్రస్ట్ కేర్ దవాఖానలో జరిగిన సమీక్షలో వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ ప్రీతీ మీనా, డీఎంఈ రమేశ్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ డాక్టర్ గంగాధర్, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.