ప్రపంచంలో కోటీశ్వరులు అత్యధికంగా ఉన్న నగరాలేవో తెలుసా?!
పేదవాడికి ధనవంతుడెప్పుడూ నక్షత్రంలా కనిపిస్తాడు. ఎందుకంటే, తారలు ఆకాశంలో వుంటే మనుషులు నేలమీద వున్నట్టే పేదవాడి జీవన శైలికీ, ధనవంతుల జీవన శైలికీ మధ్య భూమ్యాకాశాల మధ్య వుండేంత వ్యత్యాసం వుంటుంది. అయితే, జనరల్ గా ధనవంతులంతా ఎక్కువగా దాదాపుగా ఒకే ప్రాంతంలో నివసిస్తుండడం సర్వ సాధారణం.
ఈ మధ్య హెన్లీ అండ్ పార్ట్ నర్స్ ఒక నివేదికను రూపొందించింది. ఇందులో మనకు ఆశ్చర్యం కలిగించే విషయాలున్నాయి. అదేంటంటే, ప్రపంచవ్యాప్తంగా వున్న కోటీశ్వరుల్లో ఎక్కువమంది నగరాల్లోనే వుంటున్నారనీ, అదీ కొన్ని నగరాలు మాత్రమే మిలియనీర్లతో వెలిగిపోతున్నాయనీ ఆ నివేదికలో వుంది. ఈ మేరకు కోటీశ్వరులు ఎక్కువగా వున్న టాప్-10 నగరాల జాబితాను ఈ నివేదిక ద్వారా వెల్లడించింది హెన్లీ అండ్ పార్ట్ నర్స్.
న్యూయార్క్ నగరంలో 3,45,600 మంది మిలియనీర్లు, 59 మంది బిలియనీర్లు వుండగా తర్వాతి స్థానాల్లో టోక్యో, శాన్ ఫ్రాన్సిస్కో, లండన్ నగరాలున్నాయి. ఒక మిలియన్ డాలర్లు, అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టగలిగిన ఆస్తులు వున్నవారిని మిలియనీర్ ప్రాతిపదికగా తీసుకుని హెన్లీ అండ్ పార్ట్ నర్స్ గ్రూప్ ఈ నివేదిక రూపొందించింది. టాప్-10లో సగం అమెరికా నగరాలే వున్నాయి. ఆ టాప్-10 నగరాలేవో చూద్దాం...!!
1. న్యూయార్క్- 3,45,600 మిలియనీర్లు, 59 బిలియనీర్లు
2. టోక్యో- 3,04,900 మిలియనీర్లు, 12 బిలియనీర్లు
3. శాన్ ఫ్రాన్సిస్కో- 2,76,400 మిలియనీర్లు, 62 బిలియనీర్లు
4. లండన్- 2,72,400 మిలియనీర్లు, 38 బిలియనీర్లు
5. సింగపూర్- 2,49,800 మిలియనీర్లు, 26 బిలియనీర్లు
6. లాస్ ఏంజెలిస్- 1,92,400 మిలియనీర్లు, 34 బిలియనీర్లు
7. షికాగో- 1,60,100 మిలియనీర్లు, 28 బిలియనీర్లు
8. హూస్టన్- 1,32,600 మిలియనీర్లు, 25 బిలియనీర్లు
9. బీజింగ్- 1,31,500 మిలియనీర్లు, 44 బిలియనీర్లు
10. షాంఘై- 1,30,100 మిలియనీర్లు, 42 బిలియనీర్లు
