అత్యంత ప్రమాదకర దేశాలేవో మీకు తెలుసా ?
కొందరు పలానా దేశంలో చదువుకోవాలని కలలు గంటారు, గట్టిగా ప్రయత్నించి అక్కడికెళ్లి చదువుకుంటారు. వీలైతే అక్కడే సెటిలైపోతారు. మరికొందరు ఇక్కడ చదువుకుని మరో దేశానికెళ్లిపోయి అక్కడ సెటిలవుతారు. అయితే, అసలు ఏ దేశంలో ఎంత మేర భద్రత వుందో తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు వుండక్కర్లా?! అందుకే, ఓ లుక్కేద్దాం.
‘గాల్లప్ శాంతి భద్రతల సూచీ 2022’ ఈ వివరాలను వెల్లడించింది. వరుసగా మూడో ఏడాది ప్రపంచంలో భద్రత అతి తక్కువగా ఉన్న దేశంగా తాలిబాన్లు ఏలుతున్న అప్ఘానిస్థాన్ నిలిచింది. ఈ దేశం స్కోర్ 51గా ఉంది. గాబాన్ 54, వెనెజులా 55, డీఆర్ కాంగో 58, సియెర్రా లియోన్ 59 స్కోరుతో భద్రత తక్కువగా ఉన్న టాప్-5 దేశాలుగా నిలిచాయి. తూర్పు ఆసియాలో భద్రత ఎక్కువ ఉండగా, ఆగ్నేయాసియా రెండో స్థానంలో ఉంది. అత్యంత సురక్షిత దేశంగా సింగపూర్ 96 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. తజకిస్థాన్ 95, నార్వే 93, స్విట్జర్లాండ్ 92, ఇండోనేషియా 92 పాయింట్లతో తర్వాత ఉన్నాయి.
ఈ ఇండెక్స్ లో భారత్ 80 పాయింట్లతో ఉంది. పాకిస్థాన్, శ్రీలంక కంటే దిగువన ఉండగా.. అదే సమయంలో బ్రిటన్, బంగ్లాదేశ్ కంటే ఎగువన ఉంది. వ్యక్తిగత భద్రత విషయంలో ప్రజల స్పృహ, నేరాలు, చట్టాల అమలు విషయంలో వారికి ఎదురైన అనుభవంపై ప్రశ్నల ఆధారంగా గాల్లప్ దేశాలకు ఈ ర్యాంకులను కేటాయించింది. సో, ఇప్పటి నుండీ ఏ దేశంలో చదువుకుంటే బావుంటుందీ, మనం చదువుకున్న చదువుకి ఏ దేశంలోనైతే బాగా సంపాదించుకుంటూ దర్జాగా బతకవచ్చుననే అంశాలకంటే ముందు ఏ దేశం భద్రమైందనే విషయంపై కూడా ఓ లుక్కేయండి.