సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?
సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా, బాల నటుడిగా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన మహేశ్, అంచెలంచెలుగా ఎలా ఎదిగారో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. హీరోయిజానికి కార్పొరేట్ స్థాయిని కల్పించిన ఘనత సూపర్ స్టార్ మహేశ్ బాబుకి దక్కుతుంది. 'ఒక్కడు', 'మురారి', 'నిజం'... ఇలా విభిన్నమైన చిత్రాల్లో నటిస్తూ ప్రయాణిస్తున్న ఆయన, 'అర్జున్', 'అతడు', 'పోకిరి' చిత్రాలతో తన స్థాయిని పెంచుకున్నారు. 'నాని', 'నిజం' చిత్రాల్లో నటుడిగా తన స్థోమతను కనబరిచారు మహేశ్ బాబు. 'ఖలేజా', 'దూకుడు' చిత్రాలతో హీరో స్టైలిష్ కామెడీ కూడా చేయవచ్చునని నిరూపించారు. 'బిజినెస్ మేన్' సినిమాలో ఒక స్కడ్ మిస్సైల్ లా కనిపించిన మహేశ్, 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో విక్టరీ వెంకటేశ్ తో, 'మహర్షి' చిత్రంలో అల్లరి నరేశ్ తో కలసి నటించి అవసరమైతే ఇతర హీరోలతో సైతం నటించేందుకు తానెప్పుడూ సిద్ధమని నిరూపించారు.
తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ 'ముఖ్యమంత్రి' టైటిల్ తో రూపొందిన చిత్రంలో నటించగా మహేశ్, 'భరత్ అనే నేను' చిత్రంలో యంగ్ సి.ఎం.గా అలరించారు. అయితే, మహేశ్ బాబు హీరోగా నటించక ముందు బాల నటుడిగా 8 చిత్రాల్లో నటించారు. చైల్డ్ ఆర్టిస్టుగా ఆయన నటించిన తొలి చిత్రం 'నీడ'. ఈ చిత్రంలో హీరో మహేశ్ అన్నయ్య రమేశ్ బాబునే. దర్శకరత్న డా.దాసరి నారాయణరావు రూపొందించిన ఈ చిత్రంలో ఒక చిన్న పాత్రతో మహేశ్ తొలిసారిగా తెరపైకి వచ్చారు.