For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

మనదేశంలో సంవత్సరానికి ఎంతమంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారో తెలుసా ?

12:24 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:24 PM May 13, 2024 IST
మనదేశంలో సంవత్సరానికి ఎంతమంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారో తెలుసా
Advertisement

ప్రతి మనిషినీ నిత్యం ఎన్నో సమస్యలు చుట్టుముట్టి బాధిస్తూంటాయి. సింపుల్ గా చెప్పాలంటే వాటి పరిష్కారం మృగ్యమైనప్పుడు ఇక ఈ జీవితం నావల్ల కాదు అనుకున్నవారు తమ జీవితానికి తమ చేతులతోనే చరమగీతం పాడతారు. కాకపోతే, కొందరు అతి చిన్న వయసులోనే చిన్న విషయాల్ని సమస్యలుగా భావించి క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడతారు. అది వేరే విషయం.

అయితే, జాతీయ క్రైం రికార్డ్ బ్యూరో (ఎన్.సి.ఆర్.బి.) నివేదికల ప్రకారం మన దేశంలో ఏటా 1.63 లక్షల మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నిజానికి ఈ సంఖ్య వాస్తవంగా 1.90 లక్షలకు పైనే వుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్ మాత్రం ఈ సంఖ్య 2.30 లక్షలని చెబుతోంది. మరో ఆందోళనకరమైన విషయమేంటంటే ప్రమాదకరమైన క్షయ వ్యాధికన్నా ఎక్కువమంది ఆత్మహత్యలవల్లే ప్రాణాలు కోల్పోతున్నారని తేలింది. కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు... ఇలా కారణాలేవేమైనప్పటికీ నిండు ప్రాణాలు మాత్రం అర్థాందరంగా గాల్లో కలిసిపోతున్నాయి.

Advertisement GKSC

దేశంలో ప్రతి ఏడాది పెద్ద ఎత్తున ఆత్మహత్యలు జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టనట్టు వ్యవహరిస్తున్నాయని ‘స్నేహ స్వచ్ఛంద సంస్థ’ వ్యవస్థాపకురాలు డా.లక్ష్మీ విజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె తన సంస్థ ద్వారా ఆత్మహత్యల నివారణకు విశేష కృషి చేస్తున్నారు. హైదరాబాద్‌లో 9వ వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ ఆసియన్ సైకియాట్రీ రెండో రోజు సదస్సులో డా. లక్ష్మీ విజయ్ కుమార్, ఆత్మహత్యల్లో గతంలో చైనా అగ్రస్థానంలో ఉండేదని, ఇప్పుడా స్థానాన్ని భారత్ ఆక్రమించిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఆత్మహత్యల సంఖ్య పెరిగిందన్న ఆమె, ఇందుకు కొవిడ్ కూడా ఒక కారణమని అన్నారు. అంతేకాదు, ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలోనే ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నట్టు పేర్కొన్నారు. పుదుచ్చేరిలో దేశంలోనే అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టు వివరించారు.

తెలంగాణలో 26.9 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 15.3 శాతం ఆత్మహత్యలు జరుగుతున్నట్టు చెప్పారు. మరో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, నిరక్షరాస్యతా శాతం ఎక్కువని అందరూ భావించే బీహార్‌లో అతి తక్కువగా 0.70 శాతం ఆత్మహత్యలు నమోదైనట్టు పేర్కొన్నారు. అలాగే, 15-39 ఏళ్ల వయసు వ్యక్తుల మరణాలకు అత్యధిక శాతం ఆత్మహత్యలే కారణమన్నారు. 15-29 ఏళ్ల మధ్య వయసున్న మహిళల ఆత్మహత్యలు మన దేశంలోనే అధికమన్నారు. దేశంలో 33.2 శాతం ఆత్మహత్యలకు కుటుంబ సమస్యలే కారణమని ఎన్‌సీఆర్‌బీ గణాంకాలు చెబుతున్నాయని గుర్తు చేశారు.

తమిళనాడులోని కొన్ని గ్రామాల్లో సెంట్రల్ స్టోరేజీ ఫెర్టిలైజర్స్ లాకర్స్ ఏర్పాటు చేశామని, దీనివల్ల గత ఆరేడేళ్లలో ఆయా గ్రామాల్లో ఆత్మహత్యలు జరగలేదని డాక్టర్ లక్ష్మీ విజయ్ వివరించారు. ఈ సమస్యలన్నింటికీ మూల కారణాల్ని వెదికి ఆత్మహత్యల శాతాన్ని క్రమక్రమంగా తగ్గించే ప్రయత్నాల్ని ప్రారంభించాల్సిన బాధ్యత అందరిపైనా వుందని గుర్తించాలి.

Advertisement
Author Image