గల్ఫ్ వలసలు - ఘర్ వాపసీ గురించి పలు సూచనలు చేసిన మంద భీంరెడ్డి
గల్ఫ్ దేశాల నుండి వివిధ కారణాల వలన వాపస్ వచ్చిన వలస కార్మికులకు స్వగ్రామాలలో పునరావాసం కల్పించడం, వారు సమాజంతో, కుటుంబంతో పునరేకీకరణ పొందడం గురించి ఐఎల్ఓ (ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్) ప్రతినిధులు వలస వ్యవహారాల విశ్లేషకులు మంద భీంరెడ్డి తో మంగళవారం (22.11.2022) నాడు హైదరాబాద్ లో సమావేశమై పలు సూచనలు స్వీకరించారు.
ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఐఎల్ఓ దక్షిణ ఆసియా దేశాల ఇంచార్జి, కార్మికుల వలస వ్యవహారాల నిపుణుడు డినో కోరెల్, సాంకేతిక నిపుణుడు అమిష్ కర్కి హైదరాబాద్ లోని హోటల్ మారియట్ (వైస్రాయ్) లో మంద భీంరెడ్డి తో సమావేశమై గల్ఫ్ వలసలు - ఘర్ వాపసీ పై పలు సూచనలు తీసుకున్నారు. ఈ సందర్బంగా మంద భీంరెడ్డి వారిని శాలువాలతో సత్కరించి వలసల సమాచారం, సాహిత్యం కలిగిన ఇంగ్లీష్ పుస్తకాలను బహుకరించారు.
అంతకు ముందు ఐఎల్ఓ (ఇంటర్నేషనల్ లేబర్ మైగ్రేషన్) ప్రతినిధి సంజయ్ అవస్థి, ఐఓఎం (ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్) ప్రతినిధి డగ్మార్ వాల్టర్ ల ప్రతినిధి బృందం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిలతో సమావేశమయ్యారు.