For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

ఈ కామర్స్ సంస్థల డెలివరీ రంగ ఉద్యోగులు రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ప్రత్యేక చర్యలు : సీపీ సుధీర్ బాబు ఐపిఎస్

10:24 PM Aug 09, 2024 IST | Sowmya
Updated At - 10:24 PM Aug 09, 2024 IST
ఈ కామర్స్ సంస్థల డెలివరీ రంగ ఉద్యోగులు రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ప్రత్యేక చర్యలు   సీపీ సుధీర్ బాబు ఐపిఎస్
Advertisement

రాచకొండ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలలో భాగంగా ఈరోజు రాచకొండ కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐపిఎస్ గారు ట్రాఫిక్ డిసిపిలు, స్విగ్గి, జొమాటో వంటి వివిధ ప్రముఖ ఫుడ్ డెలివరీ, ఉబెర్, ఓలా, రాపిడో వంటి ప్రయాణికులను చేరవేసే సంస్థలు మరియు బిగ్ బాస్కెట్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, డిటిడిసి వంటి వస్తువులు డెలివరీ చేసే కంపెనీల స్ధానిక అధిపతులు, మేనేజర్లు, నోడల్ అధికారులు, డెలివరీ బాయ్ లను సమన్వయం చేసే ఆయా సంస్థల ప్రతినిధులతో ట్రాఫిక్ నిబంధనలు మరియు రోడ్డు ప్రమాదాల నివారణ గురించి ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కమీషనర్ గారు మాట్లాడుతూ, తమ దైనందిన విధుల్లో భాగంగా డెలివరీ ఉద్యోగులు ఆహారం మరియు వస్తువులు డెలివరీ చేసే సమయంలో సరైన డ్రైవింగ్ నైపుణ్యం లేకపోవడం, నిద్రలేమి, త్వరగా చేరుకోవాలని అనే ఆత్రుత, రాంగ్ రూట్ డ్రైవింగ్, డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడడం, వాహనాల కండిషన్ సరిగా లేకపోవడం వంటి కారణాలతో ప్రమాదాలకు గురవుతున్నారని, అంతేకాక ఎదుటి వారి ప్రాణాలను కూడా ప్రమాదంలో నెడుతున్నారని పేర్కొన్నారు.

Advertisement GKSC

పలు సందర్భాల్లో వారు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేయడం, నిషేదిత ప్రాంతాల్లో పార్కింగ్ చేయడం, చలనాలకు గురి కావడం, ప్రమాదాల బారిన పడడం వల్ల వారు కష్టపడి సంపాదించిన జీతం కూడా ఇటువంటి వాటికి ఖర్చు చేయాల్సిన అవసరం వస్తోందని తెలిపారు. తమ చదువుకు, నైపుణ్యాలకు తగిన ఉద్యోగం దొరక్క నిరుద్యోగిగా మిగిలిపోకుండా స్వయం శక్తితో ఇటువంటి పార్ట్ టైం ఉద్యోగాలలో చేరడాన్ని కమీషనర్ అభినందించారు. అటువంటి యువతకు తోడ్పాటు అందించి వారికి డ్రైవింగ్ నైపుణ్యాలు నేర్పడం, ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తామని కమిషనర్ తెలిపారు.

ప్రమాదాల నివారణ చర్యలలో భాగంగా ఇకనుండి తమ సంస్థల్లో వ్యక్తులకు నియమించుకునే సమయంలో వారి డ్రైవింగ్ లైసెన్స్, విద్యార్హతలు, నేపథ్యం, వారి మానసిక శారీరక ఆరోగ్యం, వాహనాల కండిషన్ ధ్రువీకరించడం, వారికి కొన్ని రోజుల పాటు అవసరమైన శిక్షణ ఇవ్వడం వంటివి చేయాలని సంస్థల ప్రతినిధులకు సూచించారు. అంతేకాకుండా గడిచిన మూడేళ్లలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదాల గురించి వివరించి రోడ్డు ప్రమాదాల మూలంగా ఎన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయో వివరించారు. ఫోన్ కాల్స్ ద్వారా ఆర్డర్లు కేటాయించే సమయంలో ఏ ఒక్కరి మీదా ఎక్కువ భారం పడకుండా, పరిమితికి మించి పని అప్పగించకూడదని సూచించారు.

ఇకనుండి అన్ని ఈ కామర్స్ సంస్థలు తమ ఉద్యోగుల క్షేమాన్ని, వారు ప్రమాదాల బారిన పడకుండా చూసుకోవడం తమ బాధ్యతగా భావించి జాగ్రత్తలు తీసుకోవాలని, తద్వారా ఇతరులు కూడా ప్రమాదాలకు గురయ్యే అవకాశం తగ్గుతుందని సూచించారు. తమ మేలు కోసం ఇటువంటి అవగాహన కార్యక్రమం నిర్వహించినందుకు సమావేశానికి హాజరైన ఆయా సంస్థల ప్రతినిధులు, మేనేజర్లు కమీషనర్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇకనుండి సీపీ గారి సూచనలు తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిసిపి క్రైమ్స్ అరవింద్ బాబు, డిసిపిలు ట్రాఫిక్ మనోహర్, శ్రీనివాసులు, బిగ్ బాస్కెట్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, డిటిడిసి ల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
Author Image