Rachakonda News : ఎన్నికల నిబంధనల మీద ఆన్లైన్ ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహించిన రాచకొండ కమిషనర్
లోక్ సభ ఎన్నికలకు పటిష్ఠమైన భద్రత ఏర్పాట్లు. అధికారులు ఎన్నికల కమీషన్ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి. పరిమితికి మించిన అక్రమ నగదు తక్షణమే సీజ్ చేయబడుతుంది : రాచకొండ సీపీ తరుణ్ జోషి ఐపీఎస్
త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికలను పురస్కరించుకొని నామినేషన్ల కోసం నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో చేపట్టవలసిన భద్రత ఏర్పాట్లు, వివిధ రకాల అనుమతులు మరియు కేసుల నమోదులో, సెక్షన్ల అమలు తీరులో తీసుకోవలసిన చట్ట పరమైన జాగ్రత్తల గురించి అన్ని స్థాయిల రాచకొండ సిబ్బందికి అవగాహన కల్పించడానికి ఈరోజు రాచకొండ పోలీస్ కమిషనర్ శ్రీ తరుణ్ జోషి ఐపిఎస్ గారు రాచకొండ డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసిపిలు, ఎస్ హెచ్ఓ లు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఫ్లైయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వెలెన్స్ టీం మరియు ఇతర సిబ్బందికి ఆన్లైన్ ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ ట్రైనింగ్ కార్యక్రమంలో ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు పాటించవలసిన నిబంధనల మీద సిబ్బందికి గల పరిజ్ఞానాన్ని పరీక్షించడంతో పాటు ఎన్నికల నిబంధనల న్యాయ నిపుణులు రాములు గారి ద్వారా ఎన్నికలకు సంబంధించిన అన్ని నిబంధనలు, చట్టాల మీద సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఎన్నికల ప్రక్రియలో జరిగే వాహన తనిఖీల్లో భాగంగా తీసుకోవలసిన చట్టపరమైన జాగ్రత్తలు మరియు వివిధ నేరాల మీద నమోదు చేయవలసిన కేసులకు సంబంధించిన పలు సెక్షన్ల మీద సంపూర్ణ అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ... ఎన్నికల ప్రక్రియలో నిబంధనలు పాటించని వారి మీద సరైన సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేయాలని, ఎఫ్ఐఆర్ నమోదులో మరియు విచారణలో ఎటువంటి అలసత్వం, పక్షపాతం ప్రదర్శించకూడదని కమిషనర్ హెచ్చరించారు. అక్రమంగా తరలిస్తున్న డబ్బును పట్టుకోవడానికి పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. సరైన వివరాలు లేకుండా తరలిస్తున్న పరిమితికి మించిన అక్రమ నగదును ఎక్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గారి సమక్షంలో సీజ్ చేయాలని సూచించారు. యాభై వేల పరిమితికి మించి తరలిస్తున్న అక్రమ నగదును ఎన్నికల నిబంధనల ప్రకారం సీజ్ చేసి, సదరు వ్యక్తుల వివరాలు నమోదు చేయాలని అధికారులకు సూచించారు. నగదు మాత్రమే కాక ఎన్నికల్లో లబ్ది పొందాలనే ఉద్దేశంతో తరలిస్తున్న సరైన వివరాలు లేని ఇతర బహుమతులు, చీరలు, క్రికెట్ కిట్ల వంటి ఆట వస్తువులను సీజ్ చేయాలని ఆదేశించారు. ఫ్లైయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వెలెన్స్ టీం లు విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రభుత్వ అనుమతి కలిగిన ఆయుధాలను కలిగి ఉన్న వారి నుండి సదరు ఆయుధాలను స్వాధీనం చేసుకుని ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు పోలీసు స్టేషన్ స్వాధీనంలో ఉంచాలని సూచించారు. క్రీడా పోటీల వంటి ప్రత్యేక కారణాలతో ఆయుధాలను తమ వద్ద ఉంచుకునే అవసరం ఉన్న వారు కూడా పోలీసు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. వివిధ వర్గాలకు ఎన్నికల ర్యాలీలకు అనుమతించే విషయంలో నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో డీసీపీ సైబర్ క్రైమ్ చంద్ర మోహన్, ఎస్బి డీసీపీ కరుణాకర్ , ఎలక్షన్ సెల్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, ఎస్బి ఏసిపి శ్రీధర్ రెడ్డి, ఏసిపి నరేందర్ గౌడ్, మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.