సమిష్టి కృషితో సైబరాబాద్ లో ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం : సైబరాబాద్ సీపీ
17 సెప్టెంబర్ 2024 : గణేష్ నవరాత్రుల చివరిరోజు నిమజ్జనం సందర్భంగా, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ అవినాష్ మోహంతి, ఐపీఎస్, శంషాబాద్ జోన్ మరియు మాదాపూర్ జోన్‌లోని గణేష్ నిమజ్జనాలకు సంబంధించిన చెరువులను సందర్శించి అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి సూచనలు చేశారు. సీపీ ముందుగా ముందుగా శంషాబాద్ జోన్ లోని శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కాముని చెరువు మరియు తొండుపల్లి చెరువు వద్దను సందర్శించి, డీసీపీ బి. రాజేష్ మరియు ఇతర అధికారులతో నిమజ్జన సరళిని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.
అనంతరం సీపీ మాదాపూర్ జోన్‌లోని రాయసముద్రం చెరువు (ఆర్‌సీ పురం పోలీస్ స్టేషన్ పరిధి) మరియు గంగారం చెరువు (చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధి)ను సందర్శించారు. అక్కడే ఉన్న డీసీపీ డాక్టర్ వినీత్ జీ, ఐపీఎస్., డబ్ల్యూ అండ్ సీ ఎస్ డబ్ల్యూ డీసీపీ స్రుజనా కర్నం, ఏడీసీపీ మాదాపూర్ జయరాం మరియు ఇతరులుకు పలు సూచనలు చేశారు.
గణేష్ నిమజ్జనం విజయవంతంగా మరియు ప్రశాంతంగా పూర్తయ్యేందుకు సహకరించిన పోలీసు సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, భగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు, పౌరులు మరియు ఇతర సంబంధిత వర్గాలకు కృతజ్ఞతలు తెలిపారు. నిమజ్జన ప్రక్రియ ఎటువంటి అపశృతి లేకుండా సజావుగా కొనసాగుతోందని, ఇది సైబరాబాద్ పోలీస్ విభాగం, జిహెచ్ఎంసి, టిఎస్‌ఎస్‌పిడిసిఎల్, ఆర్ అండ్ బి, ట్రాన్స్‌కో, రవాణా, నీటి పారుదల, అగ్నిమాపక, ఆరోగ్య శాఖలు మరియు ఇతర సంబంధిత విభాగాల సమిష్టి కృషి ఫలితమని ఆయన పేర్కొన్నారు.
గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా సాగేందుకు పోలీసులు, ఇతర సంబంధిత విభాగాలు కలిసి సమన్వయంతో చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిమజ్జన ప్రదేశాల్లో పిల్లలు, మహిళలు మరియు వృద్ధులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అలాగే, నిమజ్జన ప్రక్రియలో పాల్గొన్న ఉద్యోగులు, అధికారులు మరియు వాలంటీర్లకు అనుకూల వాతావరణాన్ని కల్పించడానికి చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.