చేతకాని దద్దమ్మ కిషన్‌రెడ్డి: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై కేసీఆర్ ఫైర్
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్రంగా ఆక్షేపించారు. కేంద్ర క్యాబినెట్‌లో సభ్యుడిగా రాష్ర్టానికి ప్రాతినిధ్యం వహించాల్సిన మంత్రి ఇంత చిల్లర రాజకీయాలు చేయడం దారుణమని మండిపడ్డారు. సోమవారం క్యాబినెట్ సమావేశం అనంతరం ప్రగతిభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ‘కిషన్‌రెడ్డి పెద్ద సిపాయిని అంటున్నడు. పంట ఎట్లయినా కొనిపిస్తా అంటే నువ్వు గొప్పోనివి. అట్లా కాకుండా ‘కొనం.. కొనం’ అంటున్నడు. ఓ కేంద్రమంత్రిగా ఇదా నీ గొప్పదనం? రాష్ట్ర రైతుల బతుకుతో చెలగాటం ఆడుతవా? ‘ధాన్యం కొంటవా? కొనవా? కొంటే ఎంత కొంటవు చెప్పు’ అంటే చేతగాదు. మీ ప్రధానిని అడుగలేవా? ధాన్యం ఎంత కొంటవు? అని అడిగితే.. హుజూరాబాద్, తోకబాద్ అనుకొంటూ చెత్త మాటలు మాట్లాడుతున్నరు. చిల్లర రాజకీయాలు చేస్తున్నరు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇంట్లాంటి వ్యక్తి కేంద్ర మంత్రి కావాల్నా
---------------------------
‘కేంద్రం బాయిల్డ్ రైస్ తీసుకోబోమంటున్నది. తెలంగాణల వచ్చేదే బాయిల్డ్ రైస్. బాయిల్ చేయకపోతే వచ్చేది 50 శాతమే. కానీ, కిషన్‌రెడ్డి దుర్మార్గంగా మాట్లాడుతున్నడు. రాష్ర్టానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తిగా వాస్తవ పరిస్థితిని కేంద్రానికి వివరించాలె. బియ్యం కొనేలా చేయాలె’ అన్నారు. ఎట్లనన్న చేసి కొనిపిస్తే కిషన్‌రెడ్డి సిపాయి అవుతాడన్న సీఎం.. ‘కొనమనే చెప్పే వ్యక్తి కేంద్రమంత్రి కావాల్నా తెలంగాణకు? చేతగాని దద్దమ్మ. ఏం మాట్లాడుతున్నడో అర్థం కాదు. నీకు దమ్ముంటే కేంద్రంతోని బియ్యం కొనిపియ్’ అని సవాల్ విసిరారు.
మోదీ రైతులతోనే ఉంటే బియ్యం కొనాలె
-------------------------
మోదీ రైతులతో ఉన్నాడని కిషన్‌రెడ్డి చెప్తున్నది నిజమైతే బాయిల్డ్ రైస్ కొనాలని ప్రధానికి చెప్పాలని డిమాండ్ చేశారు. ‘నువ్ అంత గొప్పోనివైతే కేంద్రంతోని కొనిపిస్తమని చెప్పు. మేం 75 లక్షల ఎకరాల్లో వరి పం డిస్తం. మీరు కొంటనంటే.. మేం వద్దంటున్నమా? రైతులు పండియ్యాలి.. వాళ్ల కొంపలు ఆరిపోవాలె. ఇక్క డ గందరగోళం చెలరేగాల్నా? తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పునరావృతం కావాల్నా?’ అంటూ కిషన్‌రెడ్డిని కేసీఆర్ నిలదీశారు. ఇప్పటికైనా బియ్యం కొంటరా? లేదా? అన్న విషయాన్ని సూటిగా చెప్పాలని డిమాండ్ చేశారు.
రైతులకు క్షమాపణ చెప్పు
-------------------
‘కిషన్‌రెడ్డీ.. నీ వ్యాఖ్యలు వాపస్ తీసుకో. తెలంగాణ రైతులను క్షమాపణ అడుగు. బహిరంగ చర్చకు వస్తా అనుకొంటే రా.. ఏ చౌరస్తాలో కూర్చుందామో చెప్పు. కేసీఆర్ షంటుతున్నడు, సిగ్గు పోతున్నదని పార్టీ ఫోరంలో చెప్పు. టార్గెట్ ఇప్పించు. అదీ మగతనం. రాజకీయాలకు ప్రత్యేక సందర్భం ఉంటది. ఆడొకటి ఈడొకటి గెలువంగనే దుంకులాడుడేనా. నువ్వు స్వయంగా ముషీరాబాద్‌లో కేసీఆర్ దెబ్బకు ఓడిపోయినవు కదా! అంత అహంకారం ఎందుకు? రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఇప్పుడు రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరుగుతున్నయి. మీ జాడ ఎక్కడనన్నా ఉన్నదా? మేం ఇప్పటికే 13 ఏకగ్రీవంగా గెలిచినం. గర్వపడుతున్నమా? ఇంకో ఆరింటికి ఎన్నిక జరుగుతన్నది. అవన్నీ గెలుస్తమని అంటున్నరు. ఒకటి రెండు పోతే పోతయి కావచ్చు. అది పెద్ద ఇష్యూనా?’ అని ప్రశ్నించారు.