సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినూత్న కార్యక్రమం
ఈ నెల 17న ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒకే రోజు కోటి మొక్కలను నాటే కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని తీసుకున్నారు ఎం.పీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు, మహమూద్ అలీ, తలసాని చేతుల మీదుగా ఇవాళ విడుదల చేశారు. యంపి మాలోతు కవిత, ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ ఫిబ్రవరి 17న మూడు మొక్కలు నాటాలను కోరారు. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ఎం.పీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు అందరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవటమే కేసీఆర్ కు మనం ఇచ్చే పుట్టిన రోజు కానుక అన్నారు.
కోటి వృక్షార్చన కార్యక్రమం తీసుకున్న పార్టీ జనరల్ సెక్రటరీ ఎం.పీ సంతోష్ కుమార్ ను, కేటీఆర్, మంత్రులు అభినందించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేస్తున్న ఈ కోటి వృక్షార్చనలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎం.పీ సంతోష్ కుమార్ కోరారు.
సీఎం జన్మదినం సందర్భంగా కోటి వృక్షార్చనలో మొక్కలు నాటే వారందరికీ ప్రత్యేకంగా గుర్తించాలని, వనమాలి బిరుదును ఇవ్వాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భావిస్తోంది. ఆ రోజు మొక్కలు నాటుతూ దిగిన ఫోటోలను ప్రత్యేక యాప్ లో అప్ లోడ్ చేయాలి. యాప్ కోసం వాట్సప్ నుంచి 9000365000 నెంబర్ కు GIC అని మెసేజ్ చేయాలి. యాప్ లింక్ తో కూడిన మెసేజ్ తిరిగి వస్తుంది. దానిలో మొక్కలు నాటుతూ సెల్ఫీ ఫోటోలను ఎవరికి వారు అప్ లోడ్ చేయాలి. కోటి వృక్షార్చనలో పాల్గొన్నందుకు గుర్తింపుగా ముఖ్యమంత్రి సందేశంతో కూడిన వనమాలి బిరుదు ఈ మెయిల్ లేదా మొబైల్ కు వారం రోజుల్లో ఎవరికివారికి చేరుతుందని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు కరుణాకర్ రెడ్డి, రాఘవ తెలిపారు.