For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

పంద్రాగస్టు కానుక.. 10 లక్షల కొత్త పింఛన్లు

03:50 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 03:50 PM May 11, 2024 IST
పంద్రాగస్టు కానుక   10 లక్షల కొత్త పింఛన్లు
Advertisement

రాష్ట్రంలో 57 ఏండ్ల వయస్సున్నవారికి స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని 15 నుంచి కొత్త పింఛన్లు అందజేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. దీంతో కొత్తగా 10 లక్షల మంది లబ్ధిపొందుతారని చెప్పారు. వీరితో పాటు డయాలసిస్‌ రోగులకు సైతం పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.

శనివారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఎం మాట్లాడుతూ... ‘కొన్ని సందర్భాలను బట్టి కొన్ని పనులుచేస్తాం. దాన్ని ఉచితం అంటే ఎలా.. రాష్ట్రంలో 57 ఏండ్ల వారికి పింఛన్‌ ఇస్తామన్నాం. పాపం వాళ్లంతా ఎదురుచూస్తున్నారు. మధ్యలో కరోనాతో ఆర్థిక మాంద్యం వచ్చి.. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారం బంద్‌ చేసి.. గందరగోళం చేసింది. మొత్తం లిస్ట్‌ తీసినం. ఇప్పుడు కొత్తగా 10 లక్షల మందికి పింఛన్లు ఇవ్వబోతున్నాం. రాష్ట్రంలో 36 లక్షల మందికి రూ.2,016 పింఛన్‌గా వస్తున్నాయి. కొత్తగా ఇచ్చేవాటితో మొత్తం 46 లక్షల మందికి పింఛన్లు అందుతాయి. వివిధ రకాల కారణాలతో విధివంచితులైన వాళ్లకు ఈ వజ్రోత్సవాల సందర్భంగా సంతోషం కలిగిద్దామని సుదీర్ఘంగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నాం.

Advertisement GKSC

15 నుంచి పింఛన్లు పంపిణీ చేస్తాం. పాతకార్డుల స్థానంలో కొత్తకార్డులను బార్‌కోడ్‌తో ఇస్తున్నాం. దీంతో కొత్త, పాతవి కలిపి మొత్తం 46 లక్షల కార్డులు ఇస్తాం. ఎమ్మెల్యేలంతా గ్రామసభలు, సమావేశాలు పెట్టి కార్డులు పంపిణీ చేస్తారు’ అని తెలిపారు. డయాలసిస్‌ రోగుల బాధ హృదయవిదారకంగా ఉన్నదని, ఆదుకోవాల్సిన అవసరం ఉన్నదని మంత్రి హరీశ్‌రావు తన దృష్టికి తీసుకొచ్చారని సీఎం కేసీఆర్‌ గుర్తుచేసుకొన్నారు. అందుకే వారికి బస్‌పాస్‌ ఇచ్చామని, ఉచితంగా డయాలసిస్‌ చేస్తున్నామని.. డయాలసిస్‌ కేంద్రాలను కూడా భారీగా పెంచామని చెప్పారు. వారికి పింఛన్‌ కూడా ఇవ్వాలని నిర్ణయించామని, రాష్ట్రంలో దాదాపు 12 వేల మంది డయాలసిస్‌ రోగులు ఉన్నట్టు తెలిసిందని పేర్కొన్నారు. వాళ్లు పనిచేసే పరిస్థితుల్లో లేరని, ఇప్పుడు కల్పిస్తున్న సౌకర్యాలు కొనసాగిస్తూనే ఆసరా కార్డు సైతం ఇచ్చి నెలకు రూ.2016 పింఛన్‌ ఇస్తామని ప్రకటించారు. బోదకాలు బాధితులకు, ఒంటరి మహిళలకు దేశంలోనే ఎక్కడా పింఛన్లు లేవని, రాష్ట్రంలో మాత్రమే ఇస్తున్నామని చెప్పారు. బీడీ కార్మికులు దేశంలో మొత్తం 16 రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ, ఎక్కడా పింఛన్‌ లేదని.. తెలంగాణలో మాత్రమే ఇస్తున్నామని తెలిపారు.

Advertisement
Author Image