రాష్ట్ర, దేశ ప్రజలందరికీ నూతన సంవత్సరం (2023) సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన CM KCR
గతాన్ని సమీక్షించుకుంటూ, వర్తమానాన్ని విశ్లేషించుకుంటూ, భవిష్యత్తును అన్వయించుకుంటూ మన జీవితాలను మరింత గుణాత్మకంగా తీర్చిదిద్దుకోవడం ద్వారానే నూతనత్వం సంతరిస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. నూతన సంవత్సరం (2023) సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రాష్ట్ర, దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
నిర్దిష్ట లక్ష్యాలను రూపొందించుకుని యువత తమ ఆశయ సాధనకై ముందుకు సాగాలన్నారు. జీవితం పట్ల సరైన దృక్పథం, సంకల్ప బలం ఉంటేనే లక్ష్య సాధనలో సఫలీకృతులవుతారని సీఎం పునరుద్ఘాటించారు. ఎన్నో అవాంతరాలు, సమస్యలు, వివక్షను ఎదుర్కుంటూ నేడు భారత దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానం అందరికీ ఆదర్శమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
అనతికాలంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దేశానికి రోల్ మోడల్ గా మారిందని తెలిపారు. 2023 నూతన సంవత్సరం తెలంగాణతో పాటు దేశ ప్రజల జీవితాల్లో అన్ని రంగాల్లో గుణాత్మక ప్రగతికి బాటలు వేయాలని, దేశంలో సరికొత్త ప్రజా రాజకీయాలకు, పాలనకు నాందిగా నూతన సంవత్సరం నిలవాలని సీఎం కోరుకున్నారు. 2023 సంవత్సరంలో సరికొత్త ఆశలు, లక్ష్యాలతో ప్రజలు మరింత సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు.