Bus Accident : ట్రాక్టర్ ను ఢీ కొట్టిన బస్సు... 3 మృతి, 16 మందికి గాయాలు !
Bus Accident : తెలంగాణ రాష్ట్రం లోని వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తకోట మండలం లోని ముమ్మాళ్లపల్లి వద్ద ఆదివారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. జాతీయ రహదారిపై చెరుకు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను గరుడ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోగా, 16 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటీన స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే వీరిలో కొందరికి తీవ్రగాయాలయ్యాయని సమాచారం అందుతుంది.
ఈ ఘటన పూర్తి వివరాల లోకి వెళ్తే... ముమ్మాళ్లపల్లి జాతీయ రహదారిపై చెరుకు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి వేగంగా వచ్చిన మియాపూర్ డిపోకి చెందిన గరుడ బస్సు ఢీ కొట్టింది. కాగా ఈ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోగా... వారిలో బస్సు డ్రైవర్, క్లీనర్ తో పాటు ఓ ప్రయాణికుడు కూడా ఉన్నారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్సుల సహాయంతో వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఈ రోడ్డు ప్రమాదంతో రహదారిపై సుమారు నాలుగు కిలో మీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తప్పించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. అలానే బస్సు లోని మిగతా ప్రయాణికులను వారి వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ట్రాక్టర్ పై ఉన్నవారికి కూడా తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం అందుతుంది.