చిక్కుల్లో చిక్కుకున్న 'రామసేతు'
వివాదాస్పదమైన అంశాల్ని తీసుకుని సినిమాల్ని రూపొందించాలంటే దానికి గట్స్ కావాలి. ఎందుకంటే, అడుగడుగునా ఏదో ఒక అడ్డంకి కలుగుతూంటుంది. ఇలాంటి కష్టాల్నే ఎదుర్కొంటోంది హిందీ సినిమా 'రామసేతు'. అక్షయ్ కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుష్రత్ భూరూచ నటించిన ఈ సినిమా అక్టోబర్ చివర్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో వాస్తవాలను వక్రీకరించారంటూ ప్రముఖ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి లీగల్ నోటీసులు పంపించారు.
అక్షయ్ కుమార్ తోపాటు, సినిమాకు సంబంధించి మరో ఎనిమిది మందికి తాను లీగల్ నోటీసులు పంపించానని స్వామి ట్విట్టర్లో ప్రకటించారు. మేథో సంపత్తి హక్కుల గురించి వారికి తెలియజెప్పేందుకే అలా చేసినట్టు ప్రకటించారు. వాస్తవాలను వక్రీకరించడం హిందీ సినిమాకు అలవాటుగా మారిందని స్వామి విమర్శించారు. స్వామి తరఫున న్యాయవాది సత్య సబర్వాల్ లీగల్ నోటీసులు పంపారు.
'నా క్లయింట్ 2007లో రామసేతు పరిరక్షణ గురించి సమర్థవంతంగా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. రామసేతుకు నష్టం కలిగించే సేతు సముద్రం షిప్ కెనాల్ ప్రాజెక్టును వ్యతిరేకించారు. దీనిపై సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ జారీ చేసి ఉంది. రామసేతును రక్షించడమే ఇందులోని అంతర్భాగం. సినిమాలోనూ దీన్నే చూపించినట్టు అయితే నా క్లయింట్ ఈ విషయంలో సహకారం అందించేవారు’ అని నోటీసుల్లో పేర్కొన్నారు. సినిమా స్క్రిప్ట్, దృశ్యాలను తన క్లయింట్ తో పంచుకోవాలని, అప్పుడే ఎటువంటి వక్రీకరణ, అవాస్తవాలకు అవకాశం ఉండదని అన్నారు. ఏదేమైనా, సినిమా విడుదలకు ముందు ఎన్ని వివాదాలు చుట్టుముడితే అంత హిట్టవుతాయనే నమ్మకం కూడా కొందరిలో వుంటుంది. హిట్టు, ఫట్టు సంగతి పక్కన బెడితే రిలీజ్ కి ముందే సినిమా బాగా పాపులరవుతుంది.
