Khammam News : ఖమ్మంలో మతోన్మాదానికి చోటు లేదు : సీపీఐ (ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్
ఖమ్మం : 29.3.2024 : జిల్లాలో రాజకీయాలు కలుషితమయ్యాయని, జిల్లాలోని ప్రజాస్వామ్యవాదులు జాగ్రత్తగా వుండాల్సిన అవసరం వుంది అని సీపీఐ (ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ అన్నారు. ఖమ్మంలో మతోన్మాదానికి చోటు లేదని తెలిపారు. జిల్లాలో కులమత తారతమ్యాలు లేకుండా జీవించే వాతావరణాన్ని కమ్యూనిస్టులు కల్పించారన్నారు. అటువంటి వాతావరణాన్ని విచ్ఛిన్నం చేసే చర్యలకు బీజేపీ దిగుతోందన్నారు.
జిల్లా ప్రజా సమస్యలపై ప్రతి సందర్భంలోనూ కమ్యూనిస్టులు, లౌకిక పార్టీలు జిల్లా జిల్లా ప్రజల కోసం నిరంతరం పోరాటాలు చేశాయని గుర్తు చేశారు. మతోన్మాద రాజకీయాలు జిల్లాలోకి రాకుండా చూడాల్సిన బాధ్యత లౌకిక, ప్రజాస్వామ్యవాదులపై వుంది అని తెలిపారు. మతోన్మాద శక్తులకు జిల్లా ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. తాగునీటి ఎద్దడి నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. స్థానిక సుందరయ్య భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీకాంత్ మాట్లాడారు.
జిల్లాలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందన్నారు. గ్రామాలు, నగరాల్లో నాలుగైదు రోజులకు ఒకసారి నీరు ఇస్తున్నారని తెలిపారు. ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేని కారణంగానే తాగునీటి సమస్య ఉత్పన్నమవుతుందన్నారు. సాగర్ ఆయకట్టులో పొలాలు ఎండిపోతున్నాయని, ట్రాక్టర్లతో నీటి తడులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. కొన్ని ప్రాంతాలను మాత్రమే అభివృద్ధి చేస్తే.. మిగతా ప్రాంతాల నుంచి వ్యతిరేకత వస్తుందని హెచ్చరించారు. గత పాలకులు ఇదే తరహా పాలన చేయడం వల్లనే ప్రజలు దానిని తిరస్కరించాలని తెలిపారు.
జిల్లాలో పరిశ్రమలు, కార్మికులు ఎక్కువగా ఉన్న దృష్ట్యా ఖమ్మం కేంద్రంగా ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని కోరారు. తీగల బ్రిడ్జి, ఆర్సీసీ వాల్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. మున్నేరుపై రంగనాయకుల గుట్ట వద్ద మరో వంతెన నిర్మించాలని, వ్యవసాయ మార్కెట్ కు వచ్చే వాహనాలకు ఇది సౌకర్యవంతంగా ఉంటుందని సూచించారు. ఖమ్మం జిల్లాలో మతోన్మాదానికి చోటు లేదని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై . విక్రమ్, కళ్యాణం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.