ఊహ తెలియని వయసులో గల్ఫ్ కు వెళ్లిన నాన్న కోసం… కూతురు ఎదిరి చూపులు
బాధ్యతలు, బంధాలు మరిచి పదహారు ఏళ్లుగా బహరేన్ లోనే - గల్ఫ్ లో అక్రమ నివాసి అగచాట్లు
పాస్‌పోర్ట్, వీసా లేనందున ఇటీవల అరెస్టు - హైదరాబాద్ ఆర్పీవో నిర్లక్ష్యం.. 'అవుట్ పాస్' జారీలో జాప్యం
Bahrain News : సౌదీ అరేబియాకు ఆరేళ్ళు, దుబాయికి మూడేళ్లు వెళ్లి వచ్చిన ఓ వ్యక్తి… ఇంకా ఎదో సాధించాలనే తపనతో తన ఐదేళ్ల కూతురిని, భార్యను వదిలి పదహారు ఏళ్ల క్రితం… 2008 లో బహరేన్ కు వెళ్లి అక్కడే ఉండిపోయిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం కొడిచెర్ల కు చెందిన గిరిజనుడు కంచు గంగయ్య (అలియాస్ కంచు చిన్న నడిపి గంగయ్య) కంపెనీ యజమాని నుంచి పారిపోయి చట్టవిరుద్ధ స్థితిలో (ఖల్లివెల్లి) అక్రమ నివాసిగా ఉన్నాడు. ఐదారు నెలల క్రితం బహరేన్ లో జరిగిన పోలీసుల తనిఖీల్లో పాస్ పోర్టు, వీసా లేనందున అతన్ని అరెస్టు చేసి జైల్లో పెట్టారు.
కంచు గంగయ్య (60) ను బహరేన్ నుంచి ఇండియాకు తెప్పించాలని అతని భార్య లక్ష్మి, కూతురు శృతి మంగళవారం హైదరాబాద్ బేగంపేట మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్ లో 'ప్రవాసీ ప్రజావాణి' లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పేరిట వినతిపత్రం సమర్పించారు. ఈ సమస్యను బహరేన్ లోని సామాజిక కార్యకర్త నోముల మురళి, హైదరాబాద్ లోని ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి దృష్టికి తేవడంతో ఆయన వారికి తగిన సలహాలు, సూచనలు ఇచ్చి సహకరించారు. గతంలో పాస్ పోర్ట్ ఆఫీసర్ గా పనిచేసిన టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్, అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్ ను వారు కలిసి సహాయం కోసం విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉండగా కంచు గంగయ్య ఫోటో గుర్తింపు ధృవీకరణ చేసి పంపిస్తే తాము తాత్కాలిక వైట్ పాస్ పోర్ట్ జారీ చేస్తామని బహరేన్ లోని ఇండియన్ ఎంబసీ మూడు సార్లు హైదరాబాద్ పాస్ పోర్ట్ కార్యాలయానికి మెయిల్ చేసినా ఆర్పీవో నుంచి స్పందన లేదు. అతన్ని బహరేన్ నుంచి భారత్ కు పంపించడం కోసం 'అవుట్ పాస్' (తాత్కాలిక వైట్ పాస్‌పోర్ట్ - ఎమర్జెన్సీ సర్టిఫికెట్) జారీ చేయడం తప్పనిసరి.
పదహారు ఏళ్ల క్రితం బహరేన్ కు వెళ్లిన కంచు గంగయ్యకు ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఏమీ లేవు. భారతీయ పౌరుడుగా నిరూపించుకోవడానికి ఏదో ఒక డాక్యుమెంటరీ రుజువు తప్పనిసరి. గంగయ్య భార్య ఆధార్ కార్డు, పాత రేషన్ కార్డు లలో భర్తగా అతని పేరు ఉండటం రుజువుగా పనికివస్తున్నాయి. హైదరాబాద్ పాస్‌పోర్ట్ అధికారి పాత రికార్డులను శోధన (సెర్చ్) చేయడంతో పాటు నిజామాబాద్ జిల్లా కలెక్టర్, పోలీసుల ద్వారా సమాచారం తెప్పించి బహరేన్ లోని ఇండియన్ ఎంబసీకి నివేదిక పంపిస్తే సమస్య పరిష్కారం అవుతుంది.
నాన్నను చూడాలని ! : ఈ సందర్బంగా గంగయ్య కూతురు 21 ఏళ్ల శ్రుతి మాట్లాడుతూ… నాన్న ఎలా ఉంటాడో తనకు తెలియదని, ఊహ తెలియనప్పుడు గల్ఫ్ కు వెళ్ళాడని అన్నారు. అమ్మ లక్ష్మి కూలీ చేసి తనను చదివించిందని, ఎస్టీ రిజర్వేషన్ తో హై స్కూల్ వరకు సాంఘిక సంక్షేమ హాస్టల్ లో ఉన్నానని తర్వాత స్కాలర్షిప్ తో ఇంటర్ బైపీసీ, నర్సింగ్ డిగ్రీ పూర్తి చేశానని అన్నారు. నాన్నతో ఫోన్ లో మాట్లాడమే కానీ ప్రత్యక్షంగా చూడలేదని… నాన్న ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నానని శ్రుతి భావోద్వేగానికి గురయ్యారు.