Dil Raju : తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన దిల్ రాజు
Telangana Film Development Corporation : టాలీవుడ్‌లో అగ్ర నిర్మాత అయితే దిల్ రాజు (వెంకటరమణ రెడ్డి)ని ప్రభుత్వం తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (టీఎఫ్‌డీసీ)కు చైర్మన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. దిల్ రాజు తన పుట్టిన రోజు (డిసెంబర్ 18) సందర్భంగా పదవీ బాధ్యతల్ని స్వీకరించారు. బుధవారం నాడు ఆయన టీఎఫ్‌డీసీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.
దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ.. ‘టీఎఫ్‌డీసీ చైర్మన్‌గా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కృతజ్ఞతలు. చిత్రపరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా ఈ టీఎఫ్‌డీసీ గతంలో పని చేసేది. మళ్లీ తెలుగు సినిమాకు పూర్వ వైభవం తీసుకు రావాలనే ఉద్దేశంతో నాకు ఈ అవకాశాన్ని కల్పించారు. తెలంగాణలో ఈ చిత్ర పరిశ్రమను మరింతగా అభివృద్ది చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.
తెలుగు సినీ పరిశ్రమ మద్రాస్ నుంచి వచ్చిన తర్వాత గుర్తింపు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు పరిశ్రమ ఇంకా అభివృద్ధి చెందాలి. హైదరాబాద్‌లోనే అన్ని భాషల చిత్రాల షూటింగ్ జరుగుతున్నాయి. అది మున్ముందు మరింతగా అభివృద్ది చెందాలని సీఎం ఆశిస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ఎఫ్‌డీసీ, నేను పని చేస్తాను. ఇండస్ట్రీలో ఉన్న ఎగ్జిబిటర్ల, డిస్ట్రిబ్యూటర్ల సమస్యల్ని ప్రభుత్వం వద్దకు తీసుకెళ్తాను. సింగిల్ విండో పర్మిషన్స్ కోసం నిర్మాతలు ఎప్పుడూ కోరుతుంటారు. ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం వద్దకు తీసుకెళ్తాను. చిత్ర పరిశ్రమ అభివృద్దికి అన్ని విధాల పాటు పడతాను’ అని అన్నారు.