ప్రజల గొంతుకని వినిపించే జర్నలిస్టులెంతమంది ? ప్రజా పక్షం వహించే జర్నలిస్టుకి బతుకుందా ?
తెలుగు మీడియాలో నిజమైన జర్నలిస్టులెంతమంది ? వెంకటకృష్ణ ఉదంతం ఏం చెబుతోంది ?
సీనియర్ జర్నలిస్టు వెంకటకృష్ణ, వీ.కె. గురించి ఈ మధ్య సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్ అంతా ఇంతా కాదు. ఓ పెద్ద సినీ, రాజకీయ నేతకు కూడా రానంత అనుకూలంగా, ప్రతికూలంగా ట్రోలింగులు వచ్చాయి. ఎవరికి నచ్చిన ఉదంతాలు వారు రాసారు. అదిగో తోక అంటే ఇదిగో పులి అనే మాదిరిగా ఓ తెగ రెచ్చిపోయిన బ్యాచులు బోలెడు. వెంకట కృష్ణ చౌదరి అంటూ వారి పేరు చివర తోకను బలంగా తగిలించి నొక్కి మరీ చాలా ఆన్ లైన్ పత్రికలు, సోషల్ మీడియా గ్రూపులు, వెబ్ సైట్లు, ఓ రాజకీయ పార్టీ అనుకూల వర్గం చిందులు తొక్కాయి. ఇది ఓ వర్గం అక్కసుకు నిదర్శనం. ఇంకా చెప్పాలంటే అదో సునకానందం.
ఓ సాధారణ చిన్న జర్నలిస్టుగా కెరీర్ ను ప్రారంభించిన అతను ఈ స్థాయికి ఎలా ఎదిగాడు. తెలంగాణ రాష్ట్ర వరంగల్ నుంచి వచ్చిన జర్నలిస్టు. ఈనాడులో చిన్న స్థాయి నుంచి ప్రారంభించి ఆ సంస్థ అధిపతి రామోజీరావు తో జరిగే మీటింగుల్లో పాల్గొనే స్థాయికి ఎదిగాడు.
ఎవరి లెక్కలు వారివి. కానీ. డిజిటల్ మీడియా అనేది లేనప్పుడ ఈనాడు వైభవం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈనాడు సంస్థ ఫుల్ స్వింగ్ లో ఉన్నప్పుడే వెంకటకృష్ణ ఈటీవీ 2 ఛానెల్ కు బ్యూరో హెడ్ గా వ్యవహరించారు. ఈనాడులో ఉద్యోగం వస్తే చాలు అనుకునే రోజుల్లోనే ఆ స్థాయిలో పని చేయడం అంటే మాటలు కావు. ఈరోజు తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో దిగ్గజాలుగా పేరుగాంచిన చాలామంది జర్నలిస్టులందరూ వీకేతో కలసి పని చేసిన వారే.
వృత్తి పరంగా చాలా లోతైన జర్నలిస్టు. ఇన్విస్టిగేటింగ్ జర్నలిజంలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. కెరీర్ తొలినాళ్ల నుంచే డాషింగ్ జర్నలిస్టు. ముఖ్యంగా విషయం, కమిట్ మెంట్ ఉండే జర్నలిస్టులకు బాగా ప్రోత్సహించే గుణం.
వీకే బ్యూరో చీఫ్ గా ఉన్నప్పుడు బాగా ఎంకరేజ్ చేసిన వాళ్లలో టీవీ 9 లో ప్రస్తుతం దూసుకుపోతోన్న అశోక్, సాక్షి ఆంధ్రప్రదేశ్ బ్యూరో ఛీఫ్ ఇస్మాయిల్, సాక్షి అనంతపురం బ్యూరో గా పని చేస్తోన్న శివారెడ్డి ఇలాంటి వారంతా వీరి ప్రోత్సాహాన్ని పొందినవారే.
ఇక బలాలు ఉన్న ప్రతి వ్యక్తికీ బలహీనతలూ ఉంటాయి. ఏ సంస్థలోనూ ఎక్కువ కాలం ఉండలేదు అనేది అది అతని వ్యక్తిగత నిర్ణయం.
ఇప్పటి మీడియా గురించి మాట్లాడితే.... అసలు మీడియా అన్నది ఎక్కడుంది. తెలుగు మిడీయానే కాదు ఆ మాట కొస్తే దేశ వ్యాప్తంగా ప్రజా మీడియా ఉందా ? ప్రజల గొంతుకని వినిపించే జర్నలిస్టులెంతమంది ? పోనీ నిజంగా ప్రజా పక్షం వహించే జర్నలిస్టుకి బతుకుందా ? అతడిని ఆదరించే ప్లాట్ ఫాం ఉందా ?
తెలుగు మీడియాలో ఏ పత్రికైనా, టీవీ ఛానల్ అయినా న్యూట్రల్ అన్నది ఉందా ? ఉన్నవన్నీ సొంత అజెండాలతో నడిచే సంస్థలే కదా ? అంతెందుకు న్యూట్రల్ ముసుగులో పుట్టుకొచ్చిన డిజిటల్ మీడియా వేదికలు కూడా ఏదో ఓ పార్టీ రంగు పూర్తిగా పులుముకున్నవే కదా ? సదరు పార్టీలు విసిరే గడ్డి కరిచి పని చేసేవే కదా ? చదవడానికి కష్టంగా ఉన్నా అది ముమ్మాటికి నిజం.
యథారాజా తథాప్రజా అంటారు. అలానే యథా మీడియా సంస్థ తథా జర్నలిస్టు అన్నమాట.
మనకు నచ్చని పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తూర్పారబట్టిన మీడియా తనకి అనుకూలమైన పార్టీ అధికారంలోకి రాగానే తన స్వరం పూర్తిగా మారిపోతోంది కదా ?
అంతెందుకు సాధారణ ప్రజల గురించి, పెరుగుతోన్న నిత్యావసరాల గురించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలిచ్చిన మోసపూరిత హామీల గురించి రాసే, చూపించే దమ్మున్న మీడియా ఎక్కడుంది ?
అంతెందుకు సీనియర్ జర్నలిస్టులు, మేథావులు సైతం వారు చేసే విశ్లేేషణల్లో ఎంతవరకూ నిజాయతీ ఉందో స్పష్టంగా చెప్పే పరిస్థితి లేదు. విశ్లేషకులుగా గొప్ప పేరు సంపాదించుకున్న వారు సైతం మీడియా వేదిక మారగానే వారి గొంతు మారుతోంది కదా ? తప్పదు. ఎందుకంటే ఇది నడుస్తోన్న సెల్ఫ్ అజెండా మీడియా ట్రెండ్.
చివరగా... ఏబీఎన్ లో వెంకటకృష్ణ కొనసాగుతున్నారు. తన పని తాను చేసుకుంటున్నారు.