Telangana News: సర్కారీ దవాఖానల్లో 50% దాటిన ప్రసవాలు - సూపర్ హిట్ అవుతున్న కేసీఆర్ కిట్
తల్లీ, బిడ్డ సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు అద్భుత ఫలితాలను ఇస్తున్నాయి. ఆరోగ్య సూచీల్లో అగ్రస్థానానికి చేరుకొని తెలంగాణను ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుపుతున్నాయి. ప్రసూతి, నవజాత శిశువులతోపాటు ఐదేండ్లలోపు చిన్నారుల మరణాలను అరికట్టడంలో ప్రభుత్వం గణనీయమైన వృద్ధిని సాధించింది. పేదరికం, రవాణా, వైద్య సౌకర్యాలు అందుబాటులో లేక గతంలో మాత, శిశు మరణాల రేటు అధికంగా ఉండేది. రాష్ట్రం వచ్చాక ప్రభుత్వం తల్లీబిడ్డల రక్షణకు పెద్దపీట వేయడంతో ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు పెరిగి మాత, శిశు మరణాలు తగ్గాయి.
గణనీయమైన మార్పులు…
-------------------
గడిచిన ఏడేండ్లలో వైద్యారోగ్య శాఖలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఇందుకు జాతీయ గణాంకాలు అద్దం పడుతున్నాయి. 2014 నుంచి 2021 నాటికి మాతాశిశు మరణాలు రికార్డుస్థాయిలో తగ్గాయి. చిన్నారుల వ్యాక్సినేషన్‌లో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నది. ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య కూడా 50 శాతం దాటింది.
ప్రభుత్వ దవాఖానాల్లో పెరిగిన సౌకర్యాలు
------------------------
సర్కారు దవాఖానాల్లో ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నది. లేబర్ రూమ్స్‌ను పెంచి మెటర్నల్ ఐసీయూలను ఏర్పాటు చేసింది. గర్భిణులను దవాఖానకు, ఇంటికి చేర్చేందుకు 102 పేరిట అమ్మఒడి వాహనాలను ఏర్పాటు చేసింది. 2017లో ప్రారంభించిన కేసీఆర్ కిట్టు పథకం తల్లీ బిడ్డకు వరంగా మారింది. ప్రభుత్వ దవాఖానాల్లో సాధారణ ప్రసవాలు పెరిగి, సీ-సెక్షన్ ఆపరేషన్లు తగ్గాయి. దేశంలోనే మొదటిసారి తెలంగాణ మిడ్ వైఫరీ వ్యవస్థను ఏర్పాటు చేసి సాధారణ కాన్పులు జరిగేలా చేస్తున్నది. నవజాత శిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వాటి సంఖ్యను 22 నుంచి 42కు పెంచుతున్నది.
చిన్నారుల రక్షణకు 133 కోట్ల నిధులు విడుదల
-----------------------
కరోనా థర్డ్ వేవ్ ముంచుకొస్తున్నదనే సూచనలతో చిన్నారులను కాపాడుకొనేందుకు ప్రభుత్వం పీడియాట్రిక్ బడ్జెట్ పేరిట రూ.133.9 కోట్ల నిధులు విడుదల చేసింది. 33 జిల్లాల్లో 5 వేలకుపైగా పడకలు ఏర్పాటు చేసి, 1,326 ఐసీయూ బెడ్లను సిద్ధంచేసింది. అవసరమైన వైద్య పరికరాలు, సర్జికల్ అండ్ కన్స్యూమబుల్స్ కొనుగోలు చేసింది. ఇమ్యూనోగ్లోబ్యులిన్లు, యాంటిబయాటిక్స్, స్టెరాయిడ్స్ అందుబాటులో ఉంచింది.
సర్కారు చర్యల్లో మచ్చుకు కొన్ని..
---------------------
★ తల్లీబిడ్డకు కేసీఆర్ కిట్..ఫలితంగా ప్రభుత్వ దవాఖానల్లో పెరిగిన ప్రసవాలు
★ గర్భిణులను దవాఖానకు, ఇంటికి చేర్చేందకు 102 పేరుతో అమ్మఒడి వాహనాలు
★ 22 నుంచి 42కు పెరిగిన నవజాత శిశు సంరక్షణ కేంద్రాలు
★ సాధారణ కాన్పులు జరిగేలా తెలంగాణ మిడ్ వైఫరీ వ్యవస్థ ఏర్పాటు
★ 33 జిల్లాల్లో 5 వేలకు పైగా పడకలు, 1,326 ఐసీయూ బెడ్స్
★ కరోనా వేళ పీడియాట్రిక్ బడ్జెట్ రూ.133.9 కోట్లు