హైదరాబాద్‌లో విమానాల మరమ్మతు కేంద్రం
ఏరోస్పేస్ రంగంలో హైదరాబాద్‌కు తిరుగులేదని మరోసారి రుజువైంది. శాఫ్రాన్ సంస్థకు చెందిన అతిపెద్ద ఎమ్మార్వో కేంద్రం ఇదే. దీని ద్వారా దాదాపు 1,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. తెలంగాణలోని ఏవియేషన్ పరిశ్రమకు మరింత ఊతం లభిస్తుంది. -మంత్రి కేటీఆర్
ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో శరవేగంగా పురోగమిస్తున్న తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు మరో విదేశీ సంస్థ ముందుకొచ్చింది. విమానయాన రంగ ఉత్పత్తుల తయారీలో ఎంతో ఖ్యాతి పొందిన ఫ్రాన్స్ దిగ్గజ సంస్థ శాఫ్రాన్ భారత్‌లో తన తొలి మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్ (ఎమ్మార్వో) కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్‌ను ఎంచుకొన్నది. రూ.1,200 కోట్ల (15 కోట్ల అమెరికన్ డాలర్ల) పెట్టుబడితో విమాన ఇంజిన్ల నిర్వహణ, మరమ్మతు కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ సిద్ధమైంది. ఈ నిర్ణయంపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఏరోస్పేస్ రంగంలో హైదరాబాద్‌కు తిరుగులేదని ఈ నిర్ణయంతో మరోసారి రుజువైందన్నారు. శాఫ్రాన్ సంస్థకు చెందిన అతిపెద్ద ఎమ్మార్వో కేంద్రం ఇదేనని, మన దేశంలో ఓ విదేశీ సంస్థ ఏర్పాటు చేస్తున్న తొలి ఇంజిన్ల నిర్వహణ కేంద్రం కూడా ఇదేనని తెలిపారు. దీని ద్వారా దాదాపు 1,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. వాణిజ్య విమానాల్లో ఉపయోగించే లీప్-1ఏ, లీప్-1బీ ఇంజిన్ల నిర్వహణకు ఏర్పాటు చేయనున్న శాఫ్రాన్ ఎమ్మార్వో కేంద్రంతో తెలంగాణలోని ఏవియేషన్ పరిశ్రమకు మరింత ఊతం లభిస్తుందని చెప్పారు.
రాష్ట్రంలో పలు ఏరోస్పేస్ దిగ్గజాలు
తెలంగాణలో ఇప్పటికే పలు దేశ, విదేశీ ఏరోస్పేస్ దిగ్గజ కంపెనీలు తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. వీటిలో బోయింగ్, లాక్‌హీడ్ మార్టిన్, జీఈ ఏవియేషన్, శాఫ్రాన్, రాఫెల్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, ఎల్బిట్ సిస్టమ్స్ తదితర ప్రముఖ గ్లోబల్ ఏరోస్పేస్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీ (ఓఈఎం) సంస్థలు ఉన్నాయి. వీటితోపాటు ప్రముఖ దేశీయ ఏరోస్పేస్, రక్షణ రంగ సంస్థలైన టాటా, అదానీ, కల్యాణి గ్రూపులు తమ పరిశ్రమలను ఏర్పాటుచేసి, వివిధ రకాల పరికరాలను తయారు చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని టాటా బోయింగ్ కంపెనీ అపాచీ హెలికాప్టర్ ప్రధాన బాడీ (ఫ్యూజ్‌లేజ్)లను తయారు చేస్తున్నది. టాటా లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ 150వ సూపర్ హెర్క్యులస్ హెలికాప్టర్ సీ-130జే ఎంపన్నేజ్ (హెలికాప్టర్ వెనుక భాగంలోని ముఖ్యమైన భాగం)లతోపాటు ఎఫ్-16 ఫైటర్ జెట్ వింగ్స్‌ను రూపొందిస్తున్నది. వెమ్ టెక్నాలజీస్ మధ్య తరహా తేలికపాటి యుద్ధ విమానం (ఎల్‌సీఏ) ‘తేజాస్’ ఫ్యూజ్‌లేజ్‌ను తయారు చేస్తున్నది.
స్పెయిన్‌కు చెందిన రోల్స్‌రాయిస్ గ్రూపు విమానాల ఇంజిన్ల తయారీకి సంబంధించిన ఐటీపీ (ఇండస్ట్రియా డీ టర్బో ప్రొపల్సర్స్) ఏరోను ఇటీవలే ప్రారంభించింది. ఈ సంస్థలకు అనుబంధంగా హైదరాబాద్‌లో అనేక చిన్న, మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ) కంపెనీలు కొనసాగుతున్నాయి. వెమ్ టెక్నాలజీస్ ఇటీవల రూ.1,000 కోట్ల పెట్టుబడితో జహీరాబాద్‌లోని నిమ్జ్‌లో సమీకృత రక్షణ ఉత్పత్తుల తయారీ కేంద్రం నిర్మాణాన్ని చేపట్టింది. రక్షణ శాఖకు ఉపయోగపడే ఏరో స్ట్రక్చర్స్, ఏరో ఇంజిన్స్, రాడార్ సిస్టమ్స్, హెలికాప్టర్లు, విమానాలకు అవసరమైన పరికరాలను ఇక్కడ రూపొందించనున్నారు. ఏరోస్పేస్, రక్షణ పరికరాల ఉత్పత్తికి నిపుణులైన ఉద్యోగులను అందించేందుకు హైదరాబాద్‌లో ఏరోస్పేస్, రక్షణ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది.